(1101C) సుమతీ శతక సారం (9+9+9 పద్యాలు)

సుమతీ శతక సారం (9+9+9 పద్యాలు)

    * “సుమతీ శతకం” చాలా సులభంగా వ్యవహార
జ్ఞానాన్ని కలిగిస్తుంది. పిల్లలకు అవసరమయ్యే 
‘సకారాత్మక’(positive) నీతులను మాత్రం  అందిస్తున్నాం. 
                           * * * * *
1 -77
పుత్త్రోత్సాహము తండ్రికి
బుత్త్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్త్రుని గనుగొని పొగడగ
బుత్త్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

2 -93
విన దగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప దగున్
గని కల్ల నిజము తెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!

3 -90
లావు గల వాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివా డెక్కినట్లు మహిలో సుమతీ!

4 -45
చేతులకు దొడవు దానము
భూతల నాథులకు దొడవు బొంకమి భువిలో
నీతియ తొడవెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

5 -47
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ!

6 -66
పరనారీ సోదరుడై
పరధనముల కాస పడక, పరులకు హితుడై
పరులు దను బొగడ నెగడియు
బరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ!

7 -36
కులకాంతతోడ నెప్పుడు
గలహింపకు, వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!

8 -50
తనవారు లేని చోటను
జనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకున్ నిలువ దగదు మహిలో సుమతీ!

9 -98
సిరి దా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరి దా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!

*************************
10 -15
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ !

11 -17
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
 .”మెప్పించుచు మెలగువాడు”ధన్యుడు సుమతీ !

12 -74
పాలను గలిసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
బాల చవి జెఱచు గావున
బాలసు డగు వాని పొందు వలదుర సుమతీ!

13 -27
కమలములు నీటబాసిన
గమలాప్తునిరశ్మి సోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ !

14 -6
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!

15 -46
తడవోర్వక యొడలోర్వక
కడు వేగం బడిచి పడిన కార్యం బగునే
తడవోర్చిన  నొడలోర్చిన
చెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

16 -82
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

17 -37
కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

18 -12
ఉడుముండదె నూఱేండ్లును
బడియుండదె పేర్మి బాము పదినూఱేండ్లున్
మడువున గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!

(మానవులు తమ జీవిత కాలంలో సాధించ వలసిన
లక్ష్యములే – నాలుగు పురుషార్థాలు : అవి  “ధర్మ,
అర్థ, కామ, మోక్షము”లు.అర్థం(ధనం), కామం (కోరిక)
అందరూ కోరుకుంటారు. కాని వాటి సంపాదన,
వినియోగం ధర్మబద్ధంగా ఉంటేనే, మనిషికి నిజమైన
ఉన్నతి, మంచి కీర్తి, మోక్షం  సులభం. మనిషి
“ఎంత నిలవ చేశాడు” అనేదాని కంటే,
” ఎలా సంపాదించాడు, ” ఎలా వినియోగించాడు”
అనేవే ప్రధానం. ఇదే భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత!)

*************************

19 -11
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !

20 -97
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ !

21 -61
నవ్వకుమీ సభ లోపల
నవ్వకుమీ తల్లి-దండ్రి-నాథుల తోడన్
నవ్వకుమీ పర సతితో
నవ్వకుమీ విప్రవరుల నయ మిది సుమతీ! 

22 -57
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట  గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరులమనసు నొవ్వగ సుమతీ.

23 -64
పతి కడకు దన్ను గూర్చిన
సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్
సుతు కడకు రిత్త చేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ!

24 -62
నీరే ప్రాణాధారము
నోరే రస భరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగార మండ్రు సిద్ధము సుమతీ!

25 -43
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు, పామరుడు తగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ!

26 -63
పగ వల దెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు* మహిలో సుమతీ!

*(వివాహం అయ్యే వరకు, లేదా యోగ్య వధూ వర
అన్వేషణ ముగిసేవరకు, లేదా కనీసం విద్యార్థి   దశ
పూర్తి అయ్యే వరకు, ప్రేమ వ్యవహారం పనికి రాదు –
అని భావం గ్రహించాలి.
ఇది యువతీ యువకు లిద్దరికీ లాభకరం, క్షేమకరం.)

27 -79
పెట్టిన దినముల లోపల
నట్టడవుల కైన వచ్చు నానార్థములున్
పెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!

(దైవానుగ్రహం కోరుతూ,  మానవ ప్రయత్నం సంపూర్ణంగా
చేయ వలసిందే !  అయినా తగినంతగా ఫలితం
రాక పోతే, అప్పుడు అనుకోవలసిన భావం
“పురాకృత కర్మ ఫలం”- “చేసుకున్న వాడికి
చేసుకున్నంత మహదేవ”. ఇదే  “కర్మ సిద్ధాంతం”.
ఇది భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతలలో ఒకటి.)

******************************************

3 వ్యాఖ్యలు to “(1101C) సుమతీ శతక సారం (9+9+9 పద్యాలు)”

  1. suresh kumar.Atchutanna Says:

    LOKAANNI CHADIVI, EE LOKAMLO CHEYA DAGINA MARIYU CHEYA KOODANI PANULU TIYYANI MATALATHO TELPI EE LOKA SAHAJAALANU TELIPE EE SUMATI SATAKA PADYAALANU PILLALU TAPPAKA NERVAALI

  2. B V KRISHNA RAO Says:

    Andhra Government should become a pioneer to All Governments in giving morals and ethics by bringing all poems of ancient scriptures, Bhagwad Geeta, Ramayana, Maha Bharata, Sumati, Vemana satakams, by including Ethics as a compulsorty subject right from Pre school to PG, and professional Courses to mould people to forestall the bad influences of western culture.

  3. Y Ram Mohan Reddy Says:

    ఎప్పుడో చదివిన సుమతి శతకం పద్యాలు ఇప్పుడు ఇక్కడ చదివాను. నే చదవని, నేర్వని ఏన్నో పద్యములు కూడా ఇక్కడి నుండి గ్రహించ గలిగాను. కృతజ్ఞతలు.
    రామ్ మోహన్ రెడ్డి.వై. భారతీయ స్టేట్ బ్యాంక్, తిరుపతి. 30.04.2013

Leave a reply to Y Ram Mohan Reddy స్పందనను రద్దుచేయి