| |
| * ఈ ఆధునిక కాలంలో”, ” ఈ రోజులలో ” ఆ పాత కాలపు ఆలోచనలేం పనికి వస్తాయి?- |
| అంటూంటారు. నిజానికి కాలంతోపాటు మారేవి కొన్నే; మారనివే చాలా ఉన్నాయి:- |
| ఆకాశం, తారకలు, సూర్యచంద్రులు, గ్రహాలు, భూమాత, సముద్రకెరటాలు, పర్వతాలు, |
| మంచు-నీరు, వృక్షజాలం, అరణ్యాలు, జలచరజాలం, పక్షిజాలం, జంతుజాలం, … |
| ఇవేవీ మారటం లేదు! |
|
| *ఇక మానవజాతి విషయం: జనన మరణాలు, సృష్టిధర్మం, మాతృత్వపు త్యాగం అనుపమ |
| మమత,తండ్రియొక్క బీజప్రదత్వం , అహంకార మమకారాలు, మనస్సు సుఖాన్ని |
| కోరుకోవటం, దుఃఖాన్ని వద్దనుకోవటం, కోరినది దొరికి తృప్తి కలిగేవరకు తాపత్రయపడటం, |
| సుఖశాంతుల కోసం నిరంతర అన్వేషణ, రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, |
| మదమాత్సర్యాలు, సంతానం అభ్యున్నతికై ఆరాటపోరాటాలు, సంకుచిత స్వార్థపర |
| మనస్తత్వాలు, శరీర నిర్మాణం పని తీరు, స్త్రీపురుష విభేదంలో హార్మోన్ల పాత్ర,…. |
| ఇవేవీ మారలేదు గదా! |
|
| * మరి ఈరోజులలో మారుతున్నవేమిటి? |
| ఆశలు, ఆశయాలు పెరుగుతున్నాయి; పోటీ తత్వం విపరీతంగా పెరుగుతోంది. |
| స్వలాభాపేక్షతో అత్యధిక జనాన్ని ఆకర్షించటం కొరకు ప్రలోభకరమైన, అసత్య అర్థసత్యాలతో |
| కూడిన, అభ్యంతరకరమైన, విలువలకు తిలోదకాలిచ్చే, మభ్యపెట్టే వాణిజ్య ప్రకటనలు |
| గుప్పించే వ్యాపారవర్గాల అధార్మికత పెరుగుతోంది. ఆకర్షణలకు లోబడటం, ఎప్పుడు |
| ఎక్కడ ఆకర్షణీయ అవకాశాలుంటే అందరూ అటే పరుగులు పెట్టటం పెరుగుతోంది . |
| (ఉదా): ఒక పడవలో నున్న అత్యధిక జనం ఒక అంచుకే పరుగులు పెడితే |
| ఏం జరుగుతుంది? పడవ తలక్రిందులు కావటం తప్ప ! |
| (ఉదా): రోడ్ల మీద నున్న జనం అంతా ఎవరి తొందర, వీలు వారు చూసుకుంటే, |
| ఆ వూరి ట్రాఫిక్ సజావుగా సాగటంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించక పోతే, |
| జరిగేది ఏమిటి?- ప్రమాదాలో, ట్రాఫిక్ జాంలో! అందరికీ మరింత ఆలస్యం తప్పనిసరి! |
|
| * మరి తగ్గుతున్నవి యేమిటి? – వివేకం, విచక్షణాజ్ఞానం తగ్గుతున్నాయి; మీడియాలో |
| ప్రకటనకర్తలకు అనుకూలమైన వార్తలూ, శాస్త్రీయ సాంప్రదాయిక విజ్ఞానానికి వ్యతిరేకమైన |
| వ్యాసాలే వస్తున్నాయి. సరియైన మార్గదర్శనం చేసేవారు కరువౌతున్నారు. చేసినా, |
| అర్థం చేసికోగల పూర్వ సంస్కారం గలవారు మరీ అరుదుగా ఉన్నారు. |
|
| * విద్యార్థి దశలో పడవలసిన సాంస్కృతిక, నైతిక పునాదులు పడక పోవటం వల్లనే |
| కదా ఈ దుఃస్థితి అంతా! |
| (ఉదా): చిన్నప్పుడు ఎక్కాలు బట్టీ పట్టిన విద్యార్థికి లెక్కలు చేయటంలో సౌలభ్యం |
| జీవితాంతం ఉంటుంది గదా! |
| అలాగే స్కూలు దశలో- న్యాయం, ధర్మం,సఛ్ఛీలం, సత్ ప్రవర్తన,నైతికత, సమాజ సేవ, |
| దేశభక్తి మొ|| సూక్తులు కంఠస్థం చేయిస్తే, వాటి భావం వివరిస్తే - |
| అట్టి పిల్లలు అవి చదవనివారి కంటే మంచి వ్యక్తులు, పౌరులు కారా? |
| (ఉదా): ” సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్!” |
| లాంటి పద్యపాదం భావంతో సహా నేర్చుకున్న పిల్లలలో, అది చదవని వారిలోకన్నా |
| స్వార్థం తగ్గి, సహాయతాగుణం ఎంతోకొంత పెరిగే అవకాశం(chance, probability) |
| తప్పనిసరిగా ఉంటుందా ఉండదా? |
|
| * ఈ పని ఎవరు చేయాలి? ప్రభుత్వం పాఠ్యప్రణాళికలో చేరిస్తే, సమస్యే లేదు! |
| ప్రభుత్వమేమో రాజకీయ నాయకులతో నిండి ఉంటుంది. వారేమో తలకు మించిన |
| రాజకీయ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు! గత ఎన్నికలలో పెట్టిన పెట్టుబడిని |
| లాభంతో సహా రాబట్టాలి; రాబోయే ఎన్నికల పెట్టుబడి కోసం ఇప్పుడే సంపాదించాలి; |
| ప్రతిపక్షాల ఎత్తులకు పైయెత్తులు వేస్తూ ప్రజలను మభ్యపెడుతూ, స్వోత్కర్ష- పరనిందలతో |
| నిరంతరం అప్రమత్తంగా ఉండాలి; తమ శక్తి యుక్తులు, సమయం వీటికే సరిపోవు! |
| ఇంక అంగబలం, అర్థబలం, అవినీతిబలం, తామసం ఉన్న బలవంతులనుండి |
| అవేవీ లేని బలహీనుల ప్రయొజనాలను కాపాడటం అనే ప్రభుత్వ ప్రాథమిక ధర్మమును, |
| బాధ్యతలను నిర్వర్తించే దెప్పుడు? మరి ప్రభుత్వం చేపట్టక పోతే యేం చెయ్యాలి? |
|
| * ఎవరికి తప్పినా , తల్లిదండ్రులకు తప్పదు గదా! |
| ఉందిగా ” ప్రైవేటు ” మంత్రం! స్కూలు యాజమాన్యం వారు భౌతిక సౌకర్యాల కల్పనలో |
| ఏకొంచెం లోపం చేసినా, “పేరెంట్స్ మీట్”లో విరుచుకుపడే పేరెంట్స్ చాలామందే ఉన్నారు. |
| అదే – వ్యక్తిత్వ వికాసానికి, కుటుంబ సౌఖ్యానికి, సామరస్యపూర్వక |
| శాంతియుత సామాజిక సహజీవనానికి, దేశాభ్యుదయానికి, అత్యవసరమైన |
| నైతిక బొధనలో ఎంత అశ్రద్ధ చూపించినా- పట్టించుకోరు. |
| ఎంతటి నిద్రాణ స్థితి ! |
|
| * తమ పిల్లలకు ఇది అవసరం అని తెలిశాక, తామయినా చెప్పాలి, స్కూలువారినైనా |
| అడగాలి, లేదా Cultural Supplement ని ట్యూషనుగా అయినా చెప్పించాలి, లేదా |
| తల్లిదండ్రులలో(తాతబామ్మలలో) ఒకరైనానేర్పించాలి. మరో మార్గం ఉందేమో చెప్పండి! |
|
| * ” మాకు చెప్పాలనే ఉంది; కాని యేమి చెప్పాలి, యెలా చెప్పాలి, యే వరసలో చెప్పాలి? “ |
| అనే సంశయం వద్దు. మా kamthasthabharathi.wordpress.com లో ఈ విషయాలు |
| పొందుపరచటం చాలావరకు అయింది, కొనసాగుతోంది కూడా ! |
|
| * మన మాతృభాష ” తెలుగు ” లొ నేర్పిస్తే, ఒకే చర్యకు రెండు ఫలితాలూ ! - |
| అటు సాంస్కృతిక నైతిక విలువలూ అబ్బుతాయి; ఇటు మాతృభాషతో దూరమూ పెరగదు! |
|
| * మొదటగా, ” వేమన సూక్తులు – 1,2 ” తో ప్రారంభించమని మా అనుభవపూర్వక సలహా ! |
|
| * శుభారంభం అగుగాక ! |