సెప్టెంబరు , 2008 నెల టపాలు

అతి మధుర పద్యాలు

సెప్టెంబరు 11, 2008


మధురాధిపతే రఖిలం మధురం  !
“కృష్ణ శతకం” భక్తి రస మాధుర్యానికి పెట్టింది పేరు!
అతి చిన్న పిల్లలకు కూడ నోఱు తిరిగేటంతటి
పదలాలిత్యం!  ప్రతి పద్యమూ రస గుళికే.
 అయినా, నా జిహ్వకు అత్యంత మధురంగా
తోచిన కొన్నిటిని మాత్రం
మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
పాఠకలోకం యొక్క సమయ పరిమితులను
దృష్టిలోనుంచుకుని నవరత్నాలను మాత్రం
అందిస్తున్నాను.
పెద్దలు ఆస్వాదించటం మాత్రమే కాదు;
పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళకు నేర్పి,
వారి చిట్టి పొట్టి ముద్దు పలుకులద్వారా వింటే,
మీకు బ్రహ్మానందమే !
ఆస్వాదింప జేయండి!
1
1 శ్రీ రుక్మిణీశ ! కేశవ !
నారద సంగీత లోల ! నగధర ! శౌరీ !
ద్వారక నిలయ ! జనార్దన !
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా !
2
2 నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !
3
3 ఓ కారుణ్య పయోనిధి !
నాకాధారంబ వగుచు నయముగ బ్రోవన్ |
నాకేల యితర చింతలు
నాకాధిప వినుత ! లోకనాయక కృష్ణా !
4
4 అగణిత వైభవ! కేశవ!
నగధర! వనమాలి! యాదినారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా!
5
5 గజరాజవరద! కేశవ!
త్రిజగత్ కల్యాణమూర్తి! దేవ! మురారీ!
భుజగేంద్రశయన! మాధవ!
విజయాప్తుడ! నన్ను గావు వేగమె కృష్ణా!
6
6 గ్రహభయ దోషము లొందవు
బహు పీడలు చేర వెఱచు పాయును నఘముల్
ఇహపర ఫలదాయక! విను
తహతహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా!
7
7 సర్వేశ్వర ! చక్రాయుధ !
శర్వాణీ వినుత నామ ! జగదభిరామా !
నిర్వాణనాథ ! మాధవ !
సర్వాత్మక ! నన్ను గావు సదయత కృష్ణా !
8
8 నారాయణ! పరమేశ్వర!
ధారాధర నీలదేహ! దానవ వైరీ!
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా! నను గావు కరుణ వెలయగ కృష్ణా!
9
9 దండమయా ! విశ్వంభర !
దండమయా ! పుండరీక దళనేత్ర హరీ !
దండమయా ! కరుణానిధి !
దండమయా ! నీకు నెపుడు దండము కృష్ణా !
***********************************
NOTE ;
సహచర బ్లాగర్లకు మనవి : మీ దృష్టికి వచ్చిన ఆణిముత్యాల లాంటి
 పద్యము ( పాదా ) లను , అవకాశం ఉంటే మీ వ్యాఖ్యతో సహా , మన
 అందరికీ అందించమని మనవి.
Please click on the title “kamthasthabharathi ” at the top
of this Postto get a full view of the side-bar. Then, pl. click
on the required page name to view similar essence
of standard works, useful for children and students, and
even for adults who had no exposure earlier.

తెలుగు కుటుంబాలలో తెలుగుదనం ఎంత?

సెప్టెంబరు 6, 2008

 

మన కుటుంబంలో, మన వంశంలో
తెలుగుదనం కొనసాగించుకునే ఉపాయం
మనమే చేయదగింది ఏమైనా ఉందా ?
ఈ రోజులలో తెలుగువారు ప్రపంచం నలుమూలలకీ
విస్తరిస్తున్నారు .ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోను
ఉంటున్న వారికి ఎలాగూ తెలుగు మాటలు వినబడవు;
తెలుగు లిపి కనబడదు. మన స్వంతరాష్ట్రంలోనే 
ఉంటున్న తెలుగు కుటుంబాలలో కూడ అదే పరిస్థితి !
వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూండటం
వల్లను, పిల్లలఆంగ్లప్రావీణ్యాన్ని ఇంకా పెంచే ఉద్దేశ్యం
తోనూ, పిల్లలను ఇంట్లో కూడ ఇంగ్లీష్ లోనే మాట్లాడమని
ప్రోద్బలం చేస్తున్నారు.
ఫలితంగా ఆ కుటుంబంలోని వ్యక్తులు క్రమంగా  ( ఒక్కో
తరం గడుస్తున్నకొద్దీ ) తెలుగు పలుకుబడికీ, భాషా
సంస్కృతులకీ, తెలుగు సంప్రదాయాలకీ విచారధారకీ
దూరమవుతున్నాము. తెలుగుదనమే లోపించిన
తెలుగువారిగా మారిపోతున్నాము !
ఈ పరిస్థితిని గమనిస్తూన్న భాషావేత్తలు, విద్యావేత్తలు
అందరూతెలుగు భాష క్షీణించిపోకుండా రక్షించుకు
నేందుకు విధివిధానాలనుసూచిస్తూనే ఉన్నారు. ఆంధ్ర -
ప్రభుత్వపరంగా రావాల్సిన చొరవ కొఱవడింది.
మరి మన కుటుంబంలో, మన వంశంలో
తెలుగుదనం కొనసాగించుకునే ఉపాయం
మనమే చేయదగింది ఏమైనా ఉందా ?
ఉన్నది. పైగా చాలా సులభం కూడా. మనం ( తల్లి –
దండ్రులం, తాతా-బామ్మలం, ఉపాధ్యాయులం ) రోజూ
రాత్రి భోజనాల దగ్గరో, ఒక్క పది నిముషాలు పిల్లలతో
గడప గలిగితే చాలు. వారిచేత  రోజూ ఒక్క సూక్తి
( Quotation ) నోటికి వచ్చేట్టుచెబితే చాలు. దాని
భావాన్ని మీదైన పద్ధతిలో వివరిస్తె, పిల్లలమీద వారి
వ్యక్తిత్వం మీద మీ ముద్ర పడుతుంది; వారు జీవితాంతం
గుర్తుంచుకునే మధురమైన అనుభూతి అవుతుంది !
వేమన ప్రజా కవి. తెలుగువారి పుణ్యఫలం. కమ్మని తేట
తెనుగులో – ఒక లయతో – పసి పిల్లలకు కూడా నోరు
తిరిగేటంతటి లాలిత్యంతో, భారతీయ సంస్కృతిలోని అన్ని
అంశాలనీ స్పృశిస్తూ, అద్భుతమైనపద్య సాహిత్యాన్ని
అందించాడు !
షుమారు 1,166 పద్యాలను పరిశీలించి, తెలుగు బాల -
బాలికలకు తెలిసి తీరవలసిన 382 ( one-line )
సూక్తులను సేకరించి, ఒక క్రమంలో అమర్చి, మీకు
అందిస్తున్నాము. రోజుకో సూక్తి చొప్పున చదివితే,
ఒక్క ఏడాదికల్లా వచ్చేస్తాయి.
ఈ వేమన సూక్తి రత్నాలను పొందటానికై, ఇలా చేయండి.
NOTE:
Please click on the title ‘ KAMTHASTHA -
BHARATHI ‘ at the top of this post, to get
a full view of the side-bar. Then, pl. click
on the page “VEMANA SUKTULU – 1 ( or 2 )
QUOTATIONS” in the side-bar.
EVERY PAGE OF THIS BLOG COMPRISES
OF ESSENCE MATERIAL OF VARIOUS
STANDARD CULTURAL AND LITERARY
WORKS WORTH  GETTING BY HEART
BY CHILDREN.